మొదటి సారి చూసినప్పుడు
ఇరువురి మధ్యన కోట గోడ కట్టాలనుకున్నా
మెరుపులా మాటలు కలిపి
అమృతధారలా ఆప్తుడైనాడు
చెలికాడై చేయి పట్టుకొని
అమ్మలా పాఠాలు చెప్పాడు
ఆదమరిచి మాట తూలితే
నాన్నలా తప్పు పట్టలేదు
మనసుపై మాయని మరకకు
సువర్ణపు రంగు లద్దుతుంటే
ఎందుకో ఈ వేళ
అతను నావాడంటూ
పలుమార్లు మనసు
వెనుదిరిగి చూసింది
బహుశా అతను
గాలివాటంగా రాలేదు కాబోలు
కాలానికి గాలం వేసి వచ్చాడేమో
అందుకే కాబోలు
మనసు కాలానికి ఎదురీది వెళుతుంది
నాది కాని దారిలోకి మనసుతో అడుగేశా..
జ్ఞాపకాల తక్కెడ సరిచూసుకుంటూ
పుట్టెడు ఆలోచనలు ఖాళీ చేస్తూ....